పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రూ78 లక్షలు కాజేసిన కేసులో 13 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయి. విచిత్రంగా, విద్యావంతులు కూడా ఈ వలలో చిక్కుకోవడం గమనార్హం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.