Skip to main content

స్పీడు పెంచితే వాహనం సీజ్...

ఏపీలో రోడ్డు ప్రమాదాల లెక్కలు టెర్రర్ పుట్టిస్తున్నాయి.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందారు. ఈ వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇందులో మూడో వంతు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్ల జరిగినవే. 53 శాతం మేర ప్రమాదాలు కార్లు, ద్విచక్ర వాహనదారుల సెల్ఫ్ యాక్సిడెంట్లు ఉన్నాయి. రహదారి ప్రమాదాల్లో ఏపీ దేశంలో 8వ స్థానంలో ఉంది.

నెల్లూరు, తిరుపతి, పలనాడు, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువ ఉంది. వాస్తవానికి ఓవర్ స్పీడ్ కారణంగా 79 శాతం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా 3 శాతం, మద్యం, మొబైల్ ఫోన్ల కారణంగా 1 శాతం చొప్పున ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారులపై 42 శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటుంటే రాష్ట్ర రహదారుల పై 21 శాతం మేర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో పై అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. వారికి సీఎం పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ప్రతీ రోడ్డు ప్రమాదంపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలన్నారు. అమిత వేగాన్ని నియంత్రించేందుకు వీలుగా ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో స్పీడ్ గవర్నర్లను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. హెచ్చరికలు జారీ చేసినా అమిత వేగంగా ప్రయాణించే వాహనాలను సీజ్ చేయాలన్నారు. జాతీయ రహదారుల పై ఉన్న 680 బ్లాక్ స్పాట్లను సరిదిద్దాలని సీఎం ఆదేశించారు.

స్లీపర్ బస్సులు వివిధ రాష్ట్రాల్లో వాహన పర్మిట్లపై కేంద్రానికి లేఖ రాయాలన్నారు. దీనిపై అధికారులు సమాధానం ఇస్తూ ఇప్పటి వరకూ అనధికారికంగా ఆల్టరేషన్ చేసిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిషన్ ఉన్న 134 బస్సులను సీజ్ చేసినట్టు సీఎంకు తెలిపారు. పాఠశాలల బస్సుల్ని కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు.

రవాణేతర వాహనాల్లో స్పీడ్ గవర్నెన్సు విధానంపై కేంద్రాన్ని సంప్రదిస్తున్నట్టు తెలిపారు. రహదారులపై ప్రమాదాల సమయంలో అత్యంత వేగంగా సమీపంలోని ఆస్పత్రులకు బాధితుల్ని తరలించేందుకు 108 అంబులెన్సులు, జాతీయ రహదారుల అంబులెన్స్ లను ఇంటిగ్రేట్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించే వారిని ప్రోత్సహించేలా చర్యలు ఉండాలన్నారు.

High Viewed News

మాజీ మంత్రి సీదిరి ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉద్దానంలో దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరం.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండల ఉద్దాన ప్రాంత ఇసుక నేలలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విరువుగా దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజ సిద్ధంగా దొరికే ఈ పుట్టగొడుగులు ఎన్నో పోషక గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే  ఆరోగ్యానికి ఎంతో మేలు కరం. ఉద్దాన ప్రాంతంలో ఈ పుట్టగొడుగులను కొందరు నాన్ వెజ్ (మాంసాహారం)గా భావిస్తే మరికొందరు వెజ్ (శాఖాహారం) గా భావిస్తున్నారు. మరి పొడవాటి తోక కలిగిన ఈ పుట్టగొడుగులు మీరు ఎప్పుడైనా రుచి చూశారా..?

పెదంచలలో జరిగిన పల్లెనిద్రలో పాల్గొన్న సీఐ రామకృష్ణ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలలో శుక్రవారం సీఐ గంధం రామకృష్ణ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఒడిశా తీరంలో నౌక మునక.. 24 మంది గల్లంతు?

ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో నౌక మునిగిపోయింది. పనామా జెండాతో వెళ్తున్న కార్గో షిప్లో 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఒడిశా నుంచి ఐరన్ ఓర్ను సింగపూర్కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. అయితే ఘటనకు గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

పలాసలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 9వ వార్డ్ డెంకివీధిలో బుధవారం రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి పర్యటించి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గూర్చి వివరించారు. అనంతరం వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.