పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేపట్టే వారికి ముహూర్తాల కష్టాలు మొదలయ్యాయి. *దాదాపు 3 నెలల వరకూ మంచి ముహూర్తాలే లేవంటున్నారు పండితులు.*
ఇందుకు కారణం శుక్ర మూఢమే. 2026 ఫిబ్రవరి 18 వరకూ మంచి రోజుల కోసం వేచి చూడాల్సిందేనని చెప్తున్నారు. మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ మాసం బహుళ అమావాస్య వరకు.. అంటే నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 17 వరకూ 83 రోజులపాటు మౌఢ్యమి ఉంటుందని, అప్పటి వరకూ శుభ ముహూర్తాలు లేవని పేర్కొన్నారు. గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వచ్చే కాలాన్ని మూఢంగా పరిగణిస్తారు. ఈ సమయంలో రెండు గ్రహాలు బలంగా ఉండవని, అందుకే వివాహం, నూతన గృహప్రవేశం, విగ్రహ ప్రతిష్ఠలు వంటి కార్యక్రమాలు నిర్వహించరు. కాగా.. తప్పనిసరిగా చేసే పనులు, నిత్యకర్మలకు మూఢమి వర్తించదు.
ప్రతి సంవత్సరం మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండేవి. ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాల్స్ ఏవీ ఖాళీ ఉండేవి కాదు. కానీ ఈసారి మాఘమాసంలో మూఢమి ఉండటంతో పెళ్లి ముహూర్తాలు కూడా లేక బుకింగ్స్ లేవని ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. పెళ్లి ముహూర్తం కోసం మూడు నెలలు ఆగాలి.