అమరావతి
అమరావతి: అమరావతిలోని కృష్ణానది తీరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో మొత్తం రూ.260 కోట్ల వ్యయంతో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనులకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నేడు భూమిపూజ చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి దాదాపు 3 వేల మంది భక్తులు హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా యంత్రాంగం వెల్లడించింది. ఆలయ ప్రాకారం నిర్మాణం, ఏడంతస్తుల రాజగోపురం, సేవామండపం, రథమండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ, పుష్కరిణి అభివృద్ధి, భక్తుల విశ్రాంతి భవనాల నిర్మాణం వంటి కీలక పనులు ఈ ప్రాజెక్టులో చేపట్టనున్నారు.
భక్తుల సౌకర్యాలు, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ఆలయ సముదాయాన్ని ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యాక అమరావతి ప్రాంతం మరో ప్రధాన తీర్థక్షేత్రంగా మారనుందని ఆశాభావం వ్యక్తమవుతోంది