Skip to main content

పలాసలో డి పట్టా భూముల్లో వివాదం

పలాసలో డీ పట్టా భూముల్లో వివాదం...

గతంలో ఈ భూముల్లో ప్రభుత్వ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు శంకుస్థాపన... మరి నేడు ఆ భూముల్లో వ్యాపారులు తగాదాలు. ప్రభుత్వ పోరంబోకు భూముల్లో వివాదాలకు కేంద్రంగా మారింది. కోట్లు విలువ చేసే భూములు కావడంతో ఒకరు నుంచి ఒకరు చేతులు మారి నేడు కోర్టు చుట్టూ తిరుగుతూ ఆ భూముల్లో తగాదాలు పడుతున్నారు. గతంలో అప్పటి టిడిపి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు జిల్లా రెవెన్యూ అధికారులు శంకుస్థాపన కూడా చేశారు. నేడు ఆ భూముల్లో తమది అంటూ తమదని వ్యాపారులు తగాదాలు పడుతుండగా రెవెన్యూ అధికారులు తమకేమి సంబంధం లేదని చేతులు ఎత్తివేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. 

పలాస మండలం కోసంగిపురం జంక్షన్ బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో సర్వేనెంబరు 67లో ఉన్న ప్రభుత్వ పోరంబోకుభూమి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది.  198 ఎకరాల భూమిలో 150 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సుడాకు అప్పగించి ప్రభుత్వ లేఅవుట్గా అభివృద్ధి చేస్తుండగా మిగిలిన భూమి అసెండ్గా మారి కొంతమందికి పట్టాలు ఇచ్చినట్లు రికార్డులు ఉన్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ భూమి చేతులు మారాలంటే ప్రత్యేకంగా కమిటీ వేసి వాటిని అందించాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం కొనుగోలు పత్రాలతో ఐదెకరాల భూమి ఐదుగురు వ్యక్తుల చేతులుమారి చివరకు మిలట్రీపోరంబోకు భూమిగా రూపాంతరం చెందింది. చివరకు ఆ భూమి కూడా నిరభ్యంతరపత్రాలు తెచ్చుకొని పబ్లిక్గా అమ్మకానికి పెట్టుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ భూమిలోనే 2018 ఏడాదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 60 సెంట్లు స్థలంలో ప్రభుత్వ పెట్రోలుబంకు, పౌరసరఫరాల గిడ్డంగి నిర్మించడానికి రూ.కోటి వ్యయంతో ఎమ్మెల్యే హోదాలో గౌతు శ్యామసుందర శివాజి, అప్పటి జాయంట్  కలెక్టర్ చక్రధర్ బాబు కలిపి శంకుస్థాపన కూడా చేసారు. ఏమి జరిగిందో గాని కనీసం ఆ ప్రాంతంలో ప్రస్తుతం శిలాఫలకం  కూడా కనిపించడం లేదు. ఇదీ అక్కడ ప్రభుత్వ భూమి ఏ విధంగా రెక్కలు విడిచిందో చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జిరాయతీ భూమి అయితే రూ.20 కోట్ల వరకూ ఉంటుంది. దీని ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో 14 ప్రైవేటు వ్యక్తులకు దాఖలు పడిన భూమి విలువ రూ100 కోట్లు ఉంటుందని అంచనా.  ఇదిలా ఉండగా కాశీబుగ్గకు చెందిన 
 తాళాను ఈశ్వరరావు అనే జీడి వ్యాపారికి అదే సర్వే నెంబరులో  ఆరు సెంట్లు స్థలం ప్రభుత్వం నుంచి ఆయనకు పట్టారూపంలో వచ్చింది. ప్రభుత్వ పెట్రోలు బంకు ఏర్పాటు చేస్తామన్న సమయంలో ఇది ప్రభుత్వ బంజరు భూమి, ఇందులో ఎవరికీ పట్టాలు ఇవ్వడం జరగదని, ఇచ్చినా వాటిని ప్రభుత్వ అవసరాలకు స్వాధీనం చేసుకుంటామని అప్పటి రెవిన్యూ అధికారులు చెప్పడంతో ఆయన తన స్థలాన్ని ధారాదత్తం చేసారు. ప్రస్తుతం ఆ స్థలంను ముగ్గురు వ్యక్తులు నందిగాం మం డలానికి చెందిన ఓ వైసీపీ నాయకుడి నుంచి కొనుగోలు చేసారు. ఆయనకు కూడా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన మాజీ సైనికోద్యోగి నుంచి దఖలుపడినట్లు రికార్డులు ఉన్నాయి. ఈ స్థలం తమదని, మిలట్రీఉద్యోగికి చెందిన ఈ స్థలంలో నిరభ్యంతరపత్రాలు కూడా ఉన్నాయని, పెట్రోలు బంకు, గిడ్డంగులు నిర్మించడానికి వీలులేదంటు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి ఆ స్థలం కోర్టుద్వారా దఖలుపడినట్లు రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదే సర్వేనెంబరులో ఆరు సెంట్లు స్థలాన్ని తాను ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేసినట్లు పద్మనాభపురం గ్రామానికి చెందిన సాహుకారి లక్ష్మి కాంతమ్మ అనే మహిళ ఆరేళ్ల నుంచి పోరాటం చేస్తోంది. ఇందులో తనకు చెందిన స్థలాన్ని కూడా వ్యాపారులు ఆక్రమించుకొని తనకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా తాళాను ఈశ్వరరావు తనకు చెందిన స్థలాన్ని తనకే చెందాలని పలాస కోర్టులో దావా వేయగా తనకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డరు అందించింది. ఈ మేరకు మంగళవారం ఆయన భవననిర్మాణ కార్మికులను వెంటపెట్టుకొని సర్వేనెంబరు 67 లో వివాదస్థలానికి చేరుకొని కంచె నిర్మాణం చేపట్టడానికి ఉపక్రమించారు. దీంతో అప్పటికే స్థలాన్ని చదునుచేసి కంచె, ఇతర నిర్మాణాలు చేస్తున్న వ్యాపారులు రావడంతో ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువురు తీవ్రవాదనలు చేసుకున్నారు. అనంతరం పోలీసుకంట్రోల్ నెం బరుకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువుర్ని పోలీస్టేషన్కు తరలించారు. రెవిన్యూ, పోలీసులు సంయుక్తంగా స్థలాన్ని పరిశీలించి నిర్ణయానికి వస్తారని, అంతవరకూ ఇరువర్గాలు పనులు ప్రారంభించవద్దని సూచించడంతో వివాదం సద్దుమణిగింది. పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో ఆర్డీఓ కార్యాలయంతో ఇతర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్డీఓ బంగ్లా వంటి నిర్మాణం కోసం స్థలాలు వెతుకుతున్న అధికారులు ప్రభుత్వ పోరంబోకు స్థలాలుగా గుర్తింపు ఉన్న సర్వేనెంబరు 67 భూములు ఎందుకు కనిపించడం లేదో అన్న సందేహాలు సర్వత్రా 13 వ్యక్తమవుతున్నాయి. బడాబాబుల ఆధీనంలో ఉన్న ఈ భూములు సేకరిస్తే ప్రభుత్వం, ప్రజలకు మేలుజరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వివాదస్పదభూముల వ్యవహారంపై పలాస తహశీల్దార్ టి.కళ్యాణచక్రవర్తిని వివరణ కోరగా హైకోర్టు ఉత్తర ట్వలు ఉన్న కారణంగా తాము వివాదంలో తలదూర్చలేదని, ఇది పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని స్పష్టం చేసారు. గతంలో రెవిన్యూశాఖ పౌరసరఫరాగిడ్డంగి, పెట్రోలుబంకు ఏర్పాటుకు స్థలం కేటాయించి భూమిపూజ చేసిన విషయం వాస్తవమేనని, అయితే కోర్టుల కారణంగా నిర్మాణం జరగలేదన్నారు.


High Viewed News

ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది : జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్

ఎయిర్‌పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష  ​శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ​​ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ​సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ​ఉపాధి అవకాశాలు: ఎయి...

పలాసలో హౌసింగ్ అధికారుల దందా...!

పీఎం జన్ మన్ ఇళ్ల లబ్ధిదారుల వద్ద హౌసింగ్ అధికారులు దోచుకుంటున్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల వారికి ఇల్లు నిర్మాణానికి 2023లో "పీఎం జన్ మన్" పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పలాస మండల పరిధిలో లోత్తూరు, లొద్దభద్ర, అల్లుకోల, తర్లాకోట పంచాయతీల పరిధిలో 60 ఇల్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇల్లు నిర్మిస్తే రూ. 2.39 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలో జామవుతుంది. కాగా హౌసింగ్ అధికారులు లబ్ధిదారుల వద్ద ఖర్చుల పేర్లతో సొమ్ము పడిన ప్రతిసారి డబ్బు వసూలు చేస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు పలాస వాసులు మృతి

తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులు మృతి. నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయ్యప్ప మాలదరించి 6 గురు యువకులు శబరిమలై వెళ్లి అక్కడ నుంచి రామేశ్వరం దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్ (24), పైడి సాయి (26) గా పోలీసులు గుర్తించారు.

పలాసలో కల్తీ మద్యం ఉత్తిదే : ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు

పలాస–కాశీబుగ్గ ప్రాంతంలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారు ఆధారాలతో ముందుకు రావాలని, వారి సమక్షంలోనే సంబంధిత దుకాణాల నుంచి మద్యం నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

బారువ సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం సోంపేట మండలం బారువ సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, JC ఫర్మన్ అహ్మద్ ఖాన్ తో కలసి యోగా ఆసనాలను వేశారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి యోగా ద్వారా మానసిక శరీరిక ప్రశాంతతను పొంద వచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.