విజయనగరం జిల్లా పూసపేటరేగ(M) చింతల అగ్రహారం గ్రామ జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా నందిగాం(M) కాపు తెంబూరు గ్రామానికి చెందిన గజరావు నగేశ్(31) గా పోలీసులు గుర్తించారు. లగేజీ వ్యాన్ తో విజయవాడ వెళ్లి తిరిగి వస్తున్న నగేష్ జాతీయ రహదారి ప్రక్కన వాహనాన్ని ఆపి కాలకృత్యాల కోసం రోడ్డు దాటుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన నగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య భవాని తో పాటు ఐదేళ్ల పాప ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.