శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెద్ద మాకన్నపల్లి గ్రామంలో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ మహేశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు జరగనున్నాయి. ఉద్యమాల గడ్డగా పేరుపొందిన ఉద్దానంలో.. సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఈ గ్రామం నుంచి పదుల సంఖ్యలో ప్రజలు అండమాన్ నికోబార్ దీవులకు వలస వెళ్లి స్థిరపడ్డారు. తరాలు మారుతున్న ఉద్దానంపై ఉన్న మక్కువతో ఓ శివాలయం తో పాటు కళ్యాణ మండపం నిర్మించాలని అండమాన్ లో స్థిరపడిన గ్రామస్తులు నిశ్చయించుకున్నారు. వారి ఆలోచన గ్రామంలో ఉన్న వారితో పంచుకున్నారు. ఎట్టకేలకు 21-05-2021 తేదీన శివాలయం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసిన సుమారు 0.80 ఎకరాల స్థలంలో చుట్టూ కొబ్బరి, జీడి, మామిడి తోటల మధ్యన సుమారు రూ. 2.50 కోట్ల నిధులతో శివాలయాన్ని నిర్మించారు. గ్రామస్తులతోపాటు పలాస లో ఉన్న వ్యాపారులు, దేశ విదేశాలలో స్థిరపడిన ఉద్దాన వాసుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందడంతో ఐదు సంవత్సరాల కాలంలో గుడి నిర్మాణాన్ని పూర్తి చేశారు. మహా బలిపురం నుంచి ప్రత్యేక దేవత మూర్తుల విగ్రహాలతో పాటు జైపూర్ నుంచి ప్రత్యేకంగా శివలింగాన్ని తీసుకురావడం విశేషం. మూడు రోజులపాటు మూడు పూట్ల అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల నుంచి ప్రత్యేక షిప్ ద్వారా ఉద్దానం చేరుకుంటున్న వారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.